నిజామాబాద్, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులు ఉండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు.
ఆర్మూర్ డివిజన్ పరిధిలో 180 జీపీలు, 1766 వార్డులకు గాను 1786 పోలింగ్ కేంద్రాలు, బోధన్ డివిజన్ పరిధిలో 152 జీపీలు, 1354 వార్డులకు గాను 1354 పోలింగ్ కేంద్రాలు, నిజామాబాద్ డివిజన్ పరిధిలో 213 జీ.పీలు, 1902 వార్డులకు గాను 1913 పోలింగ్ కేంద్రాలను ముసాయిదా జాబితాలో పొందుపర్చడం జరిగిందని వివరించారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వ తేదీలోపు తెలుపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు.
వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని, జిల్లా పాలనాధికారి ఆమోదం అనంతరం ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు. సమావేశంలో ఇంచార్జ్ డీపీఓ శ్రీనివాస్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.