కామారెడ్డి, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తూ, జిల్లాలో 19 కేంద్రాల్లో 8085 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.
ఆయా సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అన్నారు. శాంతి భద్రతలు, ఎస్కార్ట్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను కోరారు. బయో మెట్రిక్ అటెండెన్స్ కోసం సిబ్బందిని నియమించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ (144 సెక్షన్) ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్ష జరిగే రోజుల్లో జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని తెలిపారు. పరీక్ష నిర్వహించే సిబ్బందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు సిద్ధం చేయాలని తెలిపారు.
అభ్యర్థులకు రవాణాలో ఇబ్బంది కలుగకుండా అన్ని రూట్లలో పరీక్ష సమయానికి ముందే చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో ఎలాంటి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎలక్ట్రిసిటీ ఎస్.ఈ. ను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో మెడికల్ కిట్స్ తో పాటు సిబ్బందిని నియమించాలని తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. రూట్ అధికారులను, డిపార్టుమెంటల్ అధికారులను నియమించి శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డిఎస్పీ నాగేశ్వర్ రావు, రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్ కుమార్, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.