నిజామాబాద్, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఆదివారం ఉదయం సెషన్ లో జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 19,855 మంది అభ్యర్థులకు గాను, 9070 మంది హాజరు కాగా, 10,785 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు.
ఆది, సోమవారాలలో ఉదయం, మధ్యాహ్నం చొప్పున మొత్తం నాలుగు సెషన్లలో జరిగే గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడిరచారు.