కామారెడ్డి, డిసెంబరు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 జిల్లా స్థాయి పోటీలను కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 సందర్భంగా జిల్లాలో గ్రామీణ, మండల స్థాయిల్లో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని, సోమవారం నుండి ఈ నెల 21 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
16 ఈవెంట్స్ లో 323 క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. సి.ఏం. కప్ 2024 క్రీడల్లో 8000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో 2000 మంది క్రీడాకారులు సెలెక్ట్ కావడం జరిగిందని తెలిపారు. గెలుపు ఓటమిలు కాకుండా పాల్గొనడం అనేది ముఖ్యం అని అన్నారు. జిల్లా స్థాయి క్రీడా కారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ ను కనబరచాలనీ తెలిపారు. జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆటలతో పాటు చదువులో రాణించాలని అన్నారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి సానుకూలం అని, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ, జిల్లాలోని 25 మండలాల్లో 8 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని, చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడల ల్లో రాణించాలని తెలిపారు. క్రీడల్లో ఆడి ఓడిన చింతించకూడదని , జిల్లా స్థాయి వరకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాకు సి.ఎం. కప్ తీసుకురావాలని కోరారు.
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి జగన్నాథన్ మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిల్లో గెలుపొందిన క్రీడాకారులు 323 మంది జిల్లా స్థాయిలో ఆడుతున్నారని తెలిపారు. అనంతరం జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, వార్డ్ కౌన్సిలర్ వనిత రాం మోహన్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్స్, పి.ఈ.టీ.లు, పలు అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా కారులు, తదితరులు పాల్గొన్నారు.