కామారెడ్డి, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధాన రోడ్డుకిరువైపులా ఎక్కువ వరుసలలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10 లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు సజావుగా పెరిగే విధంగా చూడాలన్నారు.
రైతుల పొలాలు ఉంటే వారితో సమావేశం ఏర్పాటు చేసి వారికి కావలసిన మొక్కలను ఇచ్చి సంరక్షణ చేసే విధంగా చూడాలని కోరారు. కిలోమీటర్‌కు రెండు వేల మొక్కలు నాటి, వాచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. రక్షణ గార్డులను సక్రమంగా ఏర్పాటు చేయాలని కోరారు.
పెండిరగ్లో ఉన్న స్మశాన వాటిక, కంపోస్టు షెడ్లు వాడుకలోకి వచ్చే విధంగా చూడాలన్నారు. గ్రామాలలో రోజువారీగా తడి, పొడి చెత్తను కంపోస్ట్ షెడ్‌కి తరలించి సేంద్రియ ఎరువు తయారు చేసే విధంగా చూడాలన్నారు. సేంద్రియ ఎరువులను స్థానిక రైతులకు విక్రయించి పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలు వంద శాతం వాడుకలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి గ్రామంలో వ్యాపారుల వద్ద విరాళాలు సేకరించి 25 మొక్కలు నాటాలని కోరారు. దాతల ద్వారా విరాళాలు సేకరించి వైకుంఠ రథం, బాడీ ఫ్రీజర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సునంద, ఏపీడి సాయన్న, డిఎల్ పివోలు సాయిబాబా, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.