కామారెడ్డి, డిసెంబరు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ తెలిపారు.
నెక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రులు, ప్రభుత్వసలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొంటారన్నారు.
అమెరికాలో గౌతమ్ ఆధాని పై వచ్చిన ఆర్థిక అవకతవకలు వ్యాపార, ఆర్థిక రంగాలలో దేశ పరువును దెబ్బతీసాయి. ఆధానిపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మని లాండరింగ్, మార్కెట్ మ్యానిపులేషన్ లాంటి అంశాలలో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీసాయి. అలాగే మణిపూర్లో వరసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై మోడీ ఇప్పటి వరకు అక్కడకు వెల్లకపోవడంలాంటి అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చలో రాజ్ భవన్ కార్యక్రమాలు ఉన్నాయన్నారు.
ఈ అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రదర్శనకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ తెలిపారు.