మోర్తాడ్, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో, వడ్యాట్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ గురువారం పరిశీలించారు. సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించారు. మొబైల్ యాప్ లో నమోదు చేసిన వివరాలు దరఖాస్తుదారుల వాస్తవ వివరాలతో సరిపోయాయా లేదా అన్నది గమనించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, దరఖాస్తుదారుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి సమాచారాన్ని సేకరించి మొబైల్ యాప్ లో పొందుపరచాలని తెలిపారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫొటోతో పాటు వారి ఫొటోను, స్వంత ఇల్లు అయితే నిర్ధారిత డాక్యుమెంట్లు కానీ, ఇంటి పన్ను చెల్లించిన రసీదు లను యాప్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు.
సొంత ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తుదారు చూపిన నివేశన స్థలం, దాని డాక్యుమెంట్లను యాప్‌లో పొందుపర్చాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.