కామారెడ్డి, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మున్సిపల్ పరిధిలలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి జిల్లాలోని మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
శానిటేషన్, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, పన్నుల వసూళ్లు, అమృత్ పథకం, ఇంజనీరింగ్ పనులు, నర్సరీల్లో మొక్కల పెంపకం, వీధి లైట్లు, ఇంటింటి చెత్త సేకరణ, అడ్వర్టైజ్మెంట్ల పై పన్నుల వసూళ్లు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ పరిధుల్లో శానిటేషన్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం జరగాలని తెలిపారు.
ముఖ్యంగా కమర్షియల్ ప్రాంతాల్లో చెత్తను రోజువారీ తీయాలని అన్నారు. నాటిన మొక్కలకు రోజువారీ వాటరింగ్ జరగాలని, రెండు షిఫ్ట్‌లో వాటరింగ్ పోయాలని తెలిపారు. రూట్ వారీగా సిబ్బందికి డ్యూటీలు వేయాలని తెలిపారు. ఇంటి పన్ను వసూళ్లు వంద శాతం జరగాలని తెలిపారు.
రెగ్యులర్‌తో పాటు పెండిరగ్ ఏరియర్స్ కూడా వసూలు చేయాలని తెలిపారు. అలాగే ట్రేడ్ లైసెన్సుల పన్నులు వసూళ్లు చేయాలన్నారు. నీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా నిరంతరం సరఫరా చేయాలనీ తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రింద మంజూరైన నిధులతో పనులు పూర్తిచేసి ఫోటోలు, నిధుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని తెలిపారు.
అధికారికంగా హార్డింగ్ ఏర్పాటు చేసినట్లు గమణించామని, వాటిని తొలగించాలని, అడ్వర్టైజ్మెంట్ చార్జీలు వసూలు చేయాలని సూచించారు. అమృత్ పథకం, వివిధ పథకాల క్రింద మంజూరైన పనులు పూర్తి చేయాలనీ తెలిపారు. నర్సరీల్లో అవసరమైన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచాలని తెలిపారు.
వీధి లైట్లు వెలిగే విధంగా పర్యవేక్షించాలని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లు శ్రీహరి, స్పందన, మున్సిపల్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్, మేనేజర్లు, పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.