డిచ్‌పల్లి, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ పాఠ్య ప్రణాళికను అనుసరించి బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలను ఆగస్ట్ 5 నుంచి 18 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు.
కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి విద్యార్థుల సౌలభ్యం కోసం 47 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో కొవిద్ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్, వాటర్ బాటిల్ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు.
అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యమైన విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షాకేంద్రంలోకి ప్రవేశం కల్పించబోమని హెచ్చరించారు. కావున డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.