నిజామాబాద్, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ 1000 కార్యక్రమం పేరుతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 120 క్రిటికల్ కేర్ బెడ్స్ అంద చేయడంపై జిల్లా ప్రజల తరఫున యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
యువి కెన్ పేరుతో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తన పౌండేషన్ తరఫున జిల్లా ఆస్పత్రికి 120 క్రిటికల్ కేర్ బెడ్స్ అంద చేసినందున ప్రభుత్వ ఆసుపత్రిలో నగర మేయర్ నీతూ కిరణ్‌తో పాటు, వైద్య శాఖ అధికారులతో కలిసి వాటిని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ యువరాజ్ సింగ్ తను క్యాన్సర్‌తో బాధ పడిన విషయాన్ని ఎదుర్కొన్న బాధను ఇంకొకరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన పౌండేషన్ తరఫున 1000 క్రిటికల్ కేర్ పడకలు అందజేయడం లక్ష్యంగా పెట్టుకోగా ఇంత దూరమున్న నిజామాబాద్ ఆసుపత్రికి 120 పడకలు అందించడం ఎంతైనా సంతోషించాల్సిన విషయమన్నారు.
వాటిలో అక్కడి నుండే పలురకాల నమూనాలు పరీక్షలు చేసే 18 పడకలు మల్టీ ఛానల్ మానిటర్స్ కూడా ఉన్నాయని తెలిపారు. కరోనా మొదటి రెండవ దశలలో జిల్లా యంత్రాంగం వైద్య సిబ్బంది ఎంతో అంకితభావంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించారని కోవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి వారి వంతుగా అహోరాత్రులు కృషి చేశారని ఒక పోరాటం చేశారని కలెక్టర్ ప్రశంసించారు.
ప్రస్తుతం అందజేసిన క్రిటికల్ కేర్ బెడ్స్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, అందుకుగాను యువరాజ్ సింగ్ పౌండేషన్‌కు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా, ఐఎంఏ అధ్యక్షులు జీవన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.