నిజామాబాద్, జనవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం ఏసిపి వెంకటేశ్వర్ రావు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సైబర్ మోసాల గురించి ఈ సందర్భంగా ఏ సీ పీ వెంకటేశ్వరరావు ప్రస్తావిస్తూ, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
ప్రజల అమాయకత్వం, అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆర్థిక పరమైన మోసాలకు పాల్పడుతుంటారని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఓటిపి నెంబర్ వెల్లడిరచకూడదని సూచించారు. బ్యాంకులు ఫోన్ ద్వారా ఓటిపి అడగవని అన్నారు. పోలీసుల పేరిట, కస్టమ్ అధికారుల పేరుతో కూడా ఇటీవలి కాలంలో ఫోన్ కాల్స్ చేస్తూ, కేసుల పేరిట భయభ్రాంతులకు గురి చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా సైట్ల ద్వారా కొందరు యువతులు పరిచయం అయ్యి మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు గురి చేస్తుంటారని అన్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్ల ఆచూకీ తెలుసుకొని వారిని కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ సైబర్ విభాగం ద్వారా కృషి చేస్తోందని అన్నారు.
సైబర్ మోసాలకు గురైన వారు ఏమాత్రం సంకోచించకుండా వెంటనే సైబర్ విభాగంను సంప్రదిస్తే మోసగాళ్లను గుర్తించేందకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. అయితే సైబర్ నేరాల పట్ల కనీస అవగాహన ఏర్పరచుకుని అప్రమత్తంగా ఉంటే మోసాలకు ఆస్కారం ఉండదని హితువు పలికారు. కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.