కామారెడ్డి, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు వానకాలం పంట రుణాల లక్ష్యాన్ని వ్యవసాయ అధికారులు ఇప్పించి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. గురువారం తన ఛాంబర్‌లో వ్యవసాయ అధికారులతో పంటల సాగు వివరాలు, ఎరువుల లభ్యత, పంట రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10 లోగా 50 శాతం పంట రుణాలను రైతులకు ఇప్పించే విధంగా వ్యవసాయ అధికారులు చూడాలని కోరారు.
పంటల నమోదు వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి నమోదు చేసుకొని రైతుల సంతకాలు రిజిస్టర్‌లో తీసుకోవాలని సూచించారు. వారంలో రెండు రోజులు రైతు వేదికలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఏడాదిలోపు పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ వర్తిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకునే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు రసాయనిక ఎరువులు అందించాలని కోరారు. బాన్సువాడ డివిజన్‌కు 500, బిచ్కుందకు 500, కామారెడ్డికి 1100, ఎల్లారెడ్డికి 2000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా వ్యవసాయ అధికారులు చూడాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.