ఆర్మూర్, జనవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మశాలి సంఘం 6 వ తర్ప ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమములో సంక్షేమ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, అధ్యక్షులు వేముల ప్రకాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో అత్యధిక జనాభా గల పద్మశాలీలకు రాగల మున్సిపల్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు కేటాయించాలని, అత్యధిక సీట్లు గెలుచుకొని బీజేపి జెండా ఎగరవేసి పద్మశాలీల రాజ్యాధికారం కోసం పద్మశాలీలకే చైర్మన్ పదవి కట్ట పెట్టాలని కోరారు. రానున్న కాలంలో ఎమ్మెల్యే కు విధేయులుగా ఉంటూ పార్టీ శ్రేయస్సుకు పాటుపడతామన్నారు.
ముఖ్య అతిథి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పద్మశాలీలు అందరూ ఐక్యతగా ఉండి మీ కొరకు రిజర్వ్ చేయబడిన కౌన్సిలర్ స్థానాలలో తప్పక గెలవడానికి ప్రయత్నించాలని అన్నారు. ఆర్మూర్‌లో అవినీతిని బంధుప్రీతిని ఆమడ దూరంలో ఉంచి,భూకబ్జా రహిత పట్టణంగా తీర్చిదిద్దుతూ చట్టం న్యాయం ధర్మం వైపు అడుగులేస్తూ హిందూ ధర్మం పరిరక్షణకై సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందూ బంధువులందరూ ఐక్యతతో మెలగాలని కోరారు.
రానున్న మున్సిపల్ ఎన్నికలలో కాషాయ జెండా ఎగరవేయాలని విభేదాలు వీడి ఐక్యతతో ముందుకెళ్లాలని భవిష్యత్తులో హైందవ ధర్మాన్ని కాపాడడానికి కృషి చేయాలన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా పద్మశాలి ముద్దుబిడ్డ లందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా రిటైర్డ్ టీచర్ జింధం నరహరి వ్యవహరించారు.
కార్యక్రమంలో బిజేపి పట్టణ అధ్యక్షులు మందుల బాలు, కౌన్సిలర్ రంగన్న, ఆర్మూర్ నియోజక పద్మశాలి అధ్యక్షులు దాసరి సునీల్, 6వ తర్ప ప్రధాన కార్యదర్శి సురుకుట్ల బూమేశ్వర్, వార్డ్ ఇన్చార్జిలు వంగా వివేక్, ఏలిగేటి విఠల్, కార్యవర్గ సభ్యులు మ్యాక విష్ణు దాస్, అంకం దామోదర్, అందే నాగేశ్వర్, గుడ్ల లింగం, ఆలూరు బుచ్చన్న, పొన్న శంకర్, వేముల లుంగోజీ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.