హైదరాబాద్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
94 మంది గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల చొప్పున రూ.4 కోట్ల 70 లక్షల నిధులను త్వరగా విడుదల చేయాలని సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబులను కాంగ్రేస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డిలు ఆదివారం ఒక హోటల్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామక్రిష్ణా రావు వద్ద ఉన్న పెండిరగ్ ఫైల్‌ను ఆమోదింప చేయాలని భీంరెడ్డి, దేవేందర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారు. గల్ఫ్, ఇరాక్ లతో పాటు సింగపూర్, మలేసియా తదితర 18 ఈసీఆర్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు కూడా ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని వారు కోరారు.
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు జారీ చేసి నిధుల విడుదల కొరకు ఎదిరి చూస్తున్నవారి వివరాలు జిల్లా వారీగా. జగిత్యాల (31), నిజామాబాద్ (28), రాజన్న సిరిసిల్ల (8), నిర్మల్ (5), కామారెడ్డి, సిద్దిపేట నాలుగు చొప్పున, కరీంనగర్, మంచిర్యాల మూడు చొప్పున, మెదక్ (2), వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి ఒకటి చొప్పున మొత్తం 94.
అంతకు ముందు శనివారం సాయంత్రం ప్రవాసులతో సింగపూర్ లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం (మీట్ అండ్ గ్రీట్) కార్యక్రమంలో సీఎం ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు డా.సి.రోహిన్ రెడ్డి, సింగపూర్ తెలంగాణ సంఘం అధ్యక్షులు గడప రమేష్, మాజీ అధ్యక్షులు నీలం మహేందర్, వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, సునీతా రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.