కామరెడ్డి, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రామ సభలో చదివి వినిపించిన జాబితా ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పీట్లం మండలం మర్దండ, జోజి గావ్ గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు కోసం గత ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను గ్రామసభల్లో చదివి వినిపించారు, అట్టి జాబితాల్లో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే వివరాలు తెలియజేయాలని అన్నారు.
పథకాలకు అర్హులై ఉండి పేర్లు రానివారు ప్రస్తుత గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామసభలో దరఖాస్తు సమర్పించని వారు ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించవచ్చు, నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అట్టి దరఖాస్తులను తదుపరి పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ గ్రామ సభల్లో మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.