అర్హుందరికీ లబ్ది చేకూర్చేందుకే ప్రజా పాలన గ్రామ సభలు

నిజామాబాద్‌, జనవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి ఒక్కరు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.

ఆర్మూర్‌ మండలం గోవింద్‌ పెట్‌, మోర్తాడ్‌ మండలం సుంకేట్‌ గ్రామాలలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఆయా పథకాల కింద అర్హులుగా గుర్తించబడిన వారి ముసాయిదా జాబితాను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. జాబితాలో పేర్లు లేని వారి నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామ సభల్లో చదివి వినిపించిన పేర్లు ముసాయిదా జాబితా మాత్రమేనని, ఇందులో అనర్హులు ఉంటే వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుండి తొలగించడం జరుగుతుందన్నారు. అదే సమయంలో ఇంకనూ ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారి నుండి దరఖాస్తులు స్వీకరించేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సభలు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల గ్రామ సభలలో ఎవరైనా దరఖాస్తులు చేసుకోలేకపోయిన వారు ఈ నెల 24వ తేదీ అనంతరం మండల పరిషత్‌ కార్యాలయాలలో గల ప్రజా పాలన సేవ కేంద్రాలలో కూడా దరఖాస్తులు అందించవచ్ఛని సూచించారు.

సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళనకు, అపోహలకు గురి కావలసిన అవసరం లేదన్నారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు గ్రామాలలో అర్హులైన వారు ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునేలా విద్యావంతులు, యువకులు ,గ్రామ పెద్దలు చొరవ చూపాలని కలెక్టర్‌ సూచించారు.

సైబర్‌ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి

కాగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సుంకేట్‌ గ్రామసభలో స్థానిక ఎస్‌.ఐ ప్రజలను అప్రమత్తం చేశారు. సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని ఎవరైనా కొత్త ఫోన్‌ నెంబర్ల నుండి కాల్‌ చేస్తే, అలాంటి వారిని నమ్మకూడదని, సంబంధిత అధికారులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లో బ్యాంక్‌ ఖాతా నెంబర్లు, ఓటీపీ నెంబర్లు, ఆధార్‌ కార్డు నెంబర్లు తెలుపవద్దని జాగ్రత్తలు సూచించారు. గ్రామ సభలలో ఆర్మూర్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస రావు, మోర్తాడ్‌ ఎంపీడీఓ బ్రహ్మానందం, తహశీల్దార్‌ సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి లక్పతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆగ్రోస్‌ భూములను కాపాడడమే నా లక్ష్యం…

Print 🖨 PDF 📄 eBook 📱 హైదరాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »