నిజామాబాద్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది నెలలు కిందట ఓడ్ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని, కానీ బిసిలకు అందాల్సిన ఏ ఒక్క పథకం కూడా ఓడ్ కులస్తులకు అందడం లేదని, విద్య ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పవర్ కైలాష్ అన్నారు.
ఓడ్ కులస్తుల వృత్తి మట్టి పని కావడంతో కులస్తులు మట్టిపని పైనే ఆధారపడి ఉన్నారని, మట్టి పనికి సంబంధించిన సిమెంటు కాంక్రీటు నిర్మాణ రంగంలో భాగస్వాములుగా ఉన్నారని, కావున ఓడ్ కులస్తుల వృత్తి అభివృద్ధి కోసం మారుతున్న జీవన విధానానికి అనుకూలంగా ట్రాక్టర్లు, టిప్పర్లు, ఆటోలు, జెసిబి, సెంట్రింగ్ కాంక్రీట్ మిల్లర్లను ఎలాంటి షరతులు నిబంధనలు లేకుండా అందజేయాలని అభివృద్ధి బాటలో ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని వారు జాతీయ బిసి కమీషన్‌కు విన్నవించారు.
అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో హోటళ్లను క్యాంటీన్లను ఇతర సంబంధిత వ్యాపారాలను నిర్వహించడానికి అనుమతివ్వాలని ఓడ్ కులస్తులు కోరారు. అదేవిధంగా ఆర్అండ్బి, ఇరిగేషన్ పనుల్లో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఓడ్ కులస్తులను అభివృద్ధి బాటలో నడిపించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని భారం కాకుండా బాధ్యతగా తీసుకోవాలని ఓడ్ కులస్తులు కోరారు. ఇప్పటికే చాలా వెనుకబడి స్థాయిలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే సానుకూలమైన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఓడ్ కుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ కార్వాడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ శరత్, రామ్ కిషన్ మహారాజ్, ఓడ్ కులస్తులు పాల్గొన్నారు.