కామారెడ్డి, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించిన ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు జరుగుతున్నాయని అట్టి వివరాలు గ్రామ సభలు ఆమోదంతో, విచారణలు చేపట్టిన తరువాత డేటా ఎంట్రీ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, వ్యవసాయ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాలుగు పథకాలకు సంబంధించిన వాటిపై గ్రామ, వార్డు సభల్లో విచారణ చేపట్టిన పిదప వచ్చిన ఆక్షేపణలు, అభ్యంతరాలను పరిశీలించి డేటాను ఆన్ లైన్ లో పొందపరచాలని తెలిపారు. శుక్రవారంతో సభలు ముగిసిపోనుండడంతో డేటా ఎంట్రీ త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. ఈ నెల 26 నుండి పథకాలు ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం వరకు అయిన సభల్లో వచ్చిన వివరాలను పకడ్బందీగా ఆన్లైన్ లో అప్‌డేట్ చేయాలని అన్నారు.
జిల్లాలో సమస్యలు తలెత్తకుండా గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నందులకు యంత్రాంగాన్ని కలెక్టర్ అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.