పాఠశాలల ఆకస్మిక తనిఖీ

నందిపేట్‌, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నందిపేట మండలంలోని నూత్‌ పల్లి, తొండాకూర్‌ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్‌ పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడానికి గమనించిన కలెక్టర్‌, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా ఉండడం, బస్తాలకు ట్యాగ్‌లు లెకుండా చిరిగిపోయి కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. అనంతరం తొండాకూర్‌లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్‌ సందర్శించి విద్యార్థినీ విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

గత సంవత్సరం పదవ తరగతిలో వచ్చిన ఫలితాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసారి నూటికి నూరు శాతం విద్యార్థులందరూ అత్యుత్తమ గ్రేడ్లతో ఉత్తీర్ణత సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని అన్నారు. పాఠశాలలో అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పూర్తి చేసుకోవాలని సూచించారు.

అనంతరం కలెక్టర్‌ నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.

ఆసుపత్రిలోని రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్‌, స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట నందిపేట్‌ తహసీల్దార్‌ ఆనంద్‌, ఎంపీఓ లక్ష్మీప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Check Also

భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

Print 🖨 PDF 📄 eBook 📱 భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »