కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ అర్జీదారులు వారి సమస్యలపై దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలని తెలిపారు. సోమవారం (80) ఫిర్యాదులు అందాయని తెలిపారు. భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు మంజూరు, సదరం సర్టిఫికెట్, తదితర సమస్యలపై అర్జీలు రావడం జరిగాయని తెలిపారు.
ఎన్నికల కమీషన్ ప్రకటించిన శాశన మండలి సభ్యుల ఎన్నికల నిర్వహణకు జిల్లాలోని అధికారులను నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందని, ఆయా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకమునకై ఉద్యోగుల వివరములు సమర్పించాలని తెలిపారు.
అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ మాట్లాడుతూ, ఏం.ఎల్.సి. ఎన్నికల మాడల్ కోడ్ వచ్చినందున ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార సామాగ్రి, రాజకీయ నాయకుల ఫోటోలు కలిగిన పోస్టర్లు, ఫ్లెక్సీ లు తొలగించాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అన్నారు. త్వరలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సూచన ప్రాయంగా తెలిపారు.
కార్యక్రమంలో ఆర్డీఓ మన్నె ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.