కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శాసన మండలి నియోజక వర్గ ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని గదులను కలెక్టర్ పరిశీలించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని గదులను అదనపు కలెక్టర్ తో కలిసి సందర్శించారు.
శాసన మండలి సభ్యుల ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామాగ్రి పంపిణీకి రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల నియమావళి మేరకు గదులను ఏర్పాటు చేయాలని, సి.సి.కెమెరాలు, పోలీసు బందోబస్తు వంటివి ఏర్పాటుచేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ జనార్ధన్, రోడ్లు భవనాలు శాఖ ఈఈ రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.