విపత్తు సమయాల్లో ప్రజలకు అండగా నిలవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందిస్తూ ప్రజలకు అండగా నిలువాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కమ్యూనిటీ వాలంటీర్లకు సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సూచనల మేరకు కలెక్టరేట్‌ లోని విపత్తుల విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు ఇరవై రోజుల పాటు ‘ఆపద మిత్ర’ కార్యక్రమం పేరిట శిక్షణను ఏర్పాటు చేశారు.

ఎన్‌.డీ.ఆర్‌.ఎఫ్‌ బృందాలు ప్రతీ చోట అందుబాటులో ఉండే అవకాశాలు లేనందున కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ అందించే కార్యక్రమానికి 2016 లో శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రయోగాత్మక దశగా దేశంలోని 30 జిల్లాలలో మొదటగా ఈ తరహా శిక్షణ అందించారని, దీనివల్ల మంచి ఫలితాలు రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వాలంటీర్లను ఎంపిక చేసి ఆపద మిత్ర పేరిట శిక్షణ అందిస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు.

విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి తదితర అంశాలపై ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ వరకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ ఎంతో కీలకమైనదని, అన్ని అంశాలను శ్రద్ధగా ఆకళింపు చేసుకోవాలని, విపత్తులు సంభవించిన సమయాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని హితవు పలికారు.

ఏవైనా అంశాలు అర్ధం కాకపోతే నిస్సంకోచంగా వాటి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఆపద మిత్ర కార్యకర్తలకు మొదటి విడత శిక్షణ సమయంలో గుర్తింపు కార్డుతో పాటు, ధ్రువీకరణ పత్రం అందజేస్తారని, రెండవ దశ శిక్షణలో బీమా సదుపాయాన్ని వర్తింపజేస్తారని, మూడవ విడత శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సుమారు 10 వేల రూపాయల వరకు విలువ గల ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే పరికరాలను అందించడం జరుగుతుందని వివరించారు.

అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, భూకంపం, అతివృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడం సాధ్యం కానప్పటికీ, అవి సంభవించిన సమయాలలో తక్షణమే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆపదమిత్ర కార్యకర్తలు ఎంతో గురుతర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉన్నందున శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనుకోని రీతిలో ఉపద్రవాలు సంభవించినప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాటిస్తూ నష్ట నివారణకు కృషి చేయాలని అన్నారు. గ్రామ సైనికులుగా సమర్ధవంతమైన పాత్రను పోషిస్తూ ఆపదమిత్ర కార్యక్రమానికి సార్ధకత చేకూర్చాలని పిలుపునిచ్చారు. ఎంత త్వరగా స్పందిస్తే, అంత ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా భారీ వర్షాలు కురిసినప్పుడు, భూకంపాలు, పేలుళ్లు వంటి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదకర రసాయనాలు విడుదలైన సమాయాలలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి పరికరాలు వినియోగించాలి, ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి అనే అంశాలను అగ్నిమాపక శాఖ అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మాక్‌ డ్రిల్‌ ప్రదర్శనల ద్వారా ఇరవై రోజుల పాటు ప్రయోగాత్మకంగా శిక్షణ అందించనున్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి టి.పరమేశ్వర్‌, కలెక్టరేట్‌ లోని విపత్తుల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దుబాయిలో ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన అనిల్‌ ఈరవత్రి

Print 🖨 PDF 📄 eBook 📱 హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూఏఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »