కామారెడ్డి, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షేత్ర పర్యటనలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ భవన నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, త్రాగునీరు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీడీపీఓలు, సూపర్వైజర్లు నెలలో కనీసం 20 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్రాల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, పౌష్టికాహారం, బాలామృతం, బియ్యం తదితర సరుకుల స్టాకు రిజిస్టర్ లను పరిశీలించాలని, కేంద్రాలకు వచ్చే పిల్లల హాజరు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.

కొత్తగా నిర్మించే అంగన్వాడీ భవనాలు నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను జిల్లా సంక్షేమ అధికారిని పరిశీలించాలని సూచించారు.శిధిలావస్థలో ఉన్న భవనాల్లో కేంద్రాలను నడుపకూడదని తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ లకు స్వంత భవనాలు ఉండి విద్యుత్ సరఫరా లేని వాటికి విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని, అవసరమున్న కేంద్రాలకు విద్యుత్ సరఫరాకు మీటర్ లను సరఫరా చేయాలనీ విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్ను ఆదేశించారు.
విద్యుత్ శాఖ ఏఈఈ, సూపర్వైజర్ జాయింట్ తనిఖీ చేసి విద్యుత్ సరఫరా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు త్రాగునీటి సరఫరాకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. వచ్చే వేసవి లోగా అన్ని కేంద్రాలకు నీటీ సరఫరా అయ్యే విధంగా చూడాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సామ్ మామ్ పిల్లలపై శ్రద్ధ కనబరచాలని తెలిపారు. రిపోర్టింగ్ సరిగా నమోదు చేయాలనీ తెలిపారు.
సూపర్వైజర్స్ పనితీరును, పర్యటనలను సిడీపీఓలు పర్యవేక్షించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహారం సరఫరాలను తనిఖీ చేయాలని తెలిపారు. కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య ఎక్కువ గా నమోదు చేయడం, పిల్లల హాజరు తక్కువగా ఉండడం గమనించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
అంగన్వాడీ ల పనితీరును మెరుగుపరచి పిల్లలు, బాలింతలు, గర్భిణీలు సంఖ్య పెంచాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని ఏ.ప్రమీల, టాస్క్ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈలు దుర్గా ప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ రమేష్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, సిడీపీఒలు, సూపర్వైనర్స్, తదితరులు పాల్గొన్నారు.