కామారెడ్డి, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆస్తి పన్ను వసూళ్లు, నీటి చార్జీలు, త్రాగునీటి సరఫరా, శానిటేషన్ పనులు, మొక్కలకు వాటరింగ్, భవన నిర్మాణ పనులకు అనుమతులు, ఇంజనీరింగ్ పనులు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటిపన్ను వసూళ్లు, గత ఎరియర్స్, లను వసూళ్లు చేయాలని తెలిపారు. బిల్ కలెక్టర్లు డిమాండు మేరకు పన్నుల వసూళ్లు చేయాలని అన్నారు. రోజువారీ వసూళ్ల వివరాలు బిల్ కలెక్టర్ల వారీగా నివేదికలను ప్రతీ రోజు సాయంత్రం 6 గంటలకు తనకు సమర్పించాలని ఆదేశించారు.

మున్సిపల్ కమీషనర్ లు పన్నుల వసూళ్లపై రోజువారీ బిల్ కలెక్టర్ల వారీగా సమీక్షించాలని అన్నారు. అదేవిధంగా నీటి చార్జీలు వసూలు చేయాలనీ తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలకు ప్రతీ రోజూ ఉదయం 5 గంటలకు పారిశుధ్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ క్షేత్ర స్థాయిలో ఉండాలని, అటెండెన్స్ తీసుకోవాలని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణ నిర్వహించాలని తెలిపారు. శానిటరీ వర్కర్లకు గ్లౌసెస్, ఇతర వస్తువులు సమకూర్చాలని తెలిపారు. రోజు వారీ నివేదికలు ఉదయం 7 గంటలకు నివేదికలు సమర్పించాలని తెలిపారు.
మున్సిపల్ కమీషనర్ లు క్షేత్ర పర్యటనలు నిర్వహించాలని తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కొత్త ట్యాంకర్లు కొనుగోలు చేయాలని, పాత వాటికి మరమ్మత్తులు చేయించాలని తెలిపారు. వేసవి కాలంలో మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలని అన్నారు. వివిధ దశల్లో ఉన్న ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వైకుంఠ ధామల నిర్వహణ, ఎనిమల్ బర్త్ సెంటర్ ల నిర్వహణ చేపట్టాలని అన్నారు.
మున్సిపల్ ఆధీనంలోని దుకాణాల సముదాయంలోని అద్దెలు వసూళ్లు చేయాలనీ తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించిన ఆన్ లైన్ అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, పాల్గొన్నారు.