బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్‌ హాల్‌ లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం.ఈ.ఓ లతో సమావేశం నిర్వహించారు.

పాఠశాలలోని ప్రతి విద్యార్థిని తమ కన్న బిడ్డలుగానే భావిస్తూ, వారికి నాణ్యమైన విద్యను అందించి భావి జీవితానికి మార్గనిర్దేశకులుగా మారాలని పిలుపునిచ్చారు. బడులలో ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని, ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయని, ప్రభుత్వం నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. అయితే విద్యా బోధన సక్రమంగా లేకపోతే మౌలిక వస్తులు, ఇతర సదుపాయాల కోసం ఎన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించిన ప్రయోజనం ఉండదని అన్నారు.

ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు బోధానపరమైన విధులను అంకితభావం, చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపించిన దృష్ట్యా, ప్రణాళికాబద్ధంగా బోధన చేస్తూ సిలబస్‌ ను పూర్తి చేయాలన్నారు. ఆయా సబీజెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో తానూ ఆయా పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భంలో అనేక పాఠశాలల్లో విద్యార్థుల సామర్ధ్యాన్ని పరీక్షించినప్పుడు విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా కనిపించలేదని కలెక్టర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

విద్యార్థులు పాస్‌ మార్కులతో ఉత్తీర్ణులు అయితే చాలు అనే భావన ఎంతమాత్రం సరికాదని, దీనివల్ల ఉన్నత విద్యాభ్యాసంలో విద్యార్థులు వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు మెరుగైన విద్యను బోధిస్తే, వారి ఆలోచనా దృక్పథం, సృజనాత్మకత పెంపొందుతుందని సూచించారు. డీఎస్సీ ద్వారా కొత్తగా ఉపాధ్యాయుల నియామకాలు జరిగినందున దాదాపుగా అన్ని పాఠశాలల్లో టీచర్ల ఖాళీలు భర్తీ అయ్యాయని, సమయపాలనను పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంపై దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్‌ హితవు పలికారు.

సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్‌, పరీక్షల నియంత్రణ విభాగం అధికారి విజయభాస్కర్‌, ఎం.ఈ.లు, హెచ్‌.ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, ఫిబ్రవరి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »