గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్ల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్లో, బోధన్‌ డివిజన్‌ ఆర్‌.ఓలు, సహాయ ఆర్‌.ఓలకు బోధన్‌ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం వేర్వేరుగా మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఎన్నికల కమిషన్‌ ప్రకటనను అనుసరిస్తూ ఆర్‌.ఓలు నోటిఫికేషన్‌ జారీ చేసి, ఆ రోజు నుండే సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని, నోటిఫికేషన్‌ లో స్పష్టంగా వివరాలను పొందుపర్చాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

సమయ పాలనను పక్కాగా పాటిస్తూ, నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా, వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్‌ సూచించారు.

బ్యాలెట్‌ పేపర్‌ లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని పేరును అక్షరక్రమం కోసం పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడిరచాల్సి ఉంటుందని అన్నారు. నోటిఫికేషన్‌ జారీ చేసిన నాటి నుండి ప్రతి రోజు త్వరితగతిన డైలీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్‌ సైట్లో అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను స్కాన్‌ చేసి అప్లోడ్‌ చేయాలని సూచించారు.

నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో, విత్‌ డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయిస్తే, తగిన ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరిగితే, పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియలు సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆర్‌.ఓలు, సహాయ ఆర్‌.ఓలకు కలెక్టర్‌ మార్గనిర్దేశం చేశారు.

శిక్షణ తరగతుల్లో బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, నిజామాబాద్‌ ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌, డీ.ఎల్‌.పీ.ఓలు, ఆర్‌.ఓలు, సహాయ ఆర్‌.ఓలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.19, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »