నిజామాబాద్, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందిస్తూ ప్రజలకు అండగా నిలువాలనే సంకల్పంతో ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా, వరద సహాయక చర్యలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఎన్డీఆర్‌ఎఫ్ సూచనల మేరకు కలెక్టరేట్ లోని విపత్తుల విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు ఇరవై రోజుల పాటు ‘ఆపద మిత్ర’ కార్యక్రమం పేరిట శిక్షణను కొనసాగిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద వరదలు సంభవించిన సమయాల్లో సహాయక చర్యలు చేపట్టాల్సిన తీరు గురించి క్షేత్రస్ధాయిలో ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా సంబంధిత శాఖల అధికారులు తెలియజేశారు. లైఫ్ బోట్ లు అందుబాటులో ఉంటే వాటిని ఎలా వినియోగించాలి, లైఫ్ జాకెట్లు ఇతర పరికరాల సహాయంతో ప్రాణ నష్టాన్ని నివారిస్తూ వరద విపత్తు బారి నుండి ప్రజలను ఎలా కాపాడాలి అనే అంశాలను ప్రయోగాత్మకంగా వివరించారు.
![](https://i0.wp.com/telanganalive.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-7.06.26-PM.jpeg?resize=618%2C251)
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రకృతిపరంగా, మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో ఆపదమిత్ర కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. విపత్తుల సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి తదితర అంశాలపై ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ వరకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.
ఈ శిక్షణ ఎంతో కీలకమైనదని, అన్ని అంశాలను శ్రద్ధగా ఆకళింపు చేసుకోవాలని, అవసరమైన సమయాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని వాలంటీర్లకు సూచించారు. ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడం సాధ్యం కానప్పటికీ, అవి సంభవించిన సమయాలలో తక్షణమే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి అనే అంశాలను అగ్నిమాపక శాఖ అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. బుధవారం సైతం ఈ శిక్షణా కొనసాగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి టి.పరమేశ్వర్, కలెక్టరేట్ లోని విపత్తుల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.