నిజామాబాద్, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నర్సింగ్‌పల్లి లోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో మా పల్లె సంస్థ పక్షాన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన కళాకారులను త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కవి, వ్యాఖ్యాత ఘనపురం దేవేందర్, ప్రసిద్ధ కూచిపూడి, ఆంధ్ర నాట్యం ఆచార్యులు జయలక్ష్మి, ప్రసిద్ధ గాయనీమని సంగీత గురువు స్వప్న, ప్రముఖ రంగస్థలం సినీ నటుడు రవి, ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు విజయ్ లను గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా సంస్కృతి పరంగా భారతదేశం అత్యంత ధనవంతమైన దేశమని అన్నారు. అందుకు కవుల కళాకారుల పాత్ర అద్వితీయమని అభినందించారు . వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యక్రమాలలో కళాకారుల సహకారం అభినందనీయమని మా పల్లె ట్రస్ట్ దేవస్థానం ఆలయ ధర్మకర్త వి. నరసింహారెడ్డి ప్రశంసించారు.
కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.