నిజామాబాద్, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పెండిరగ్‌లో ఉన్న 4 వేల 650 కోట్ల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజులు కట్టలేక ఒత్తిడితో చదువుకు దూరమయ్యే పరిస్థితి ఎదుర్కొంటున్నారని, ఒకవైపు ఎగ్జామ్స్ దగ్గరలో ఉండగా మరోవైపు ఫీజు భారం విద్యార్థుల పై పడి అనేక ఇబ్బందులు పడుతున్నారని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల్లో పూర్తి ఫీజులు చెల్లిస్తామని బీసీ విద్యార్థులకు షరతులు లేని విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు, కానీ నేడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమని, ఇదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారికి వేల కోట్ల బిల్లు ఒకేసారి శాంక్షన్ చేయడం ఇది దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు.
ఇంజనీరింగ్ విద్యలో కూడా 10 వేల ర్యాంక్ నిబద్ధత బీసీ విద్యార్థులకు ఎత్తివేస్తామని మాటిచ్చి దాన్ని కూడా నిలుపుకోలేకపోయిందని డిగ్రీ ఇంటర్మీడియట్ ఒకవైపు ప్రవేట్ కాలేజీ యజమాన్యాలు విద్యాసంస్థలు నడపలేక తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టుకోలేని పరిస్థితులలో కాలేజీలు మూతపడే పరిస్థితుల్లో వారు ఉన్నారన్నారు. మరోవైపు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫీజు భారం మోయలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు.
మెడిసిన్ ప్రవేశాల్లో బి కేటగిరి సి క్యాటగిరిలో రిజర్వేషన్లు అమలు చేయాలని మొదట ఓపెన్ క్యాటగిరి పిలిచిన తర్వాతనే రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు విద్యార్థులను ప్రవేశాల ద్వారా తీసుకోవాలని వారు కోరారు. పది రోజుల్లో పూర్తి పెండిరగ్ ఫీజులు విడుదల చేయకపోతే కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బందుకు అదేవిధంగా రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు, కొయ్యాడ శంకర్, సంతోష్ కుమార్, బసవరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.