కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రభుత్వ పాఠశాలల బడి పిల్లలకు నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షల శిభిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్రింద జిల్లాలో ఇప్పటికే 3580 మంది విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఆయా పిల్లలకు మరోసారి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన కళ్ల జోళ్ళు అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, టెక్రియాల్ కే.జి.బి.వి. పాఠశాల విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కామారెడ్డి లో 200 మంది, బాన్సువాడ ఏరియా ఆసుపత్రి లో 150 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అనంతరం ఆసుపత్రిలోని సిబ్బంది, డాక్టర్ల హాజరు రిజిస్టర్ లను, బయో మెట్రిక్ అటెండెన్స్ లను కలెక్టర్ పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధులకు సకాలంలో హాజరై హాజరు రిజిస్టర్ లో సంతకాలు చేయాలని తెలిపారు. అనంతరం మెన్స్ వార్డ్, డయాలసిస్ , ఐ.సి.యు., కంటి శస్త్ర చికిత్సల గదులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి ఆరోగ్యం ఎలా వుంది, ఎప్పుడు చేరారు, వైద్య సదుపాయాలు ఎలా వున్నాయి అని అడిగి తెలుసుకున్నారు.
రోజువారీ చెత్తను మున్సిపల్ వాహనంలో తరలించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగంను ఆదేశించారు. ఆసుపత్రిలో నీటి కోసం సంపు ను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, గార్బేజ్ నిల్వలను ప్రతీరోజు తీసుకవెల్లివిధంగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమీషనర్‌కు సూచించారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్ర శేఖర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.వెంకట్, ఆసుపత్రి డాక్టర్లు రాంసింగ్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.