కోటగిరి, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కోటగిరిలో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా, సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా అని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహమ్మద్ ముబీన్‌ను అడిగి తెలుసుకున్నారు.
కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూంలను సందర్శించి, బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. వంట నూనె, పాలు, కోడిగుడ్ల నాణ్యత పరిశీలించిన కలెక్టర్, కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు.

అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంత మంది రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారనే వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు.
అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులను పలుకరించి వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, పీ.హెచ్.సీ లోనే ఔషధాలను అందిస్తున్నారా అని ఆరా తీశారు. సమయ పాలన పాటిస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని మెడికల్ ఆఫీసర్ కు, సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.