పంటల క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభం అయినందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్‌ వ్యాపారులు మార్కెట్‌ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ, రైతుల వద్ద నుండి పంటను సేకరించేలా చూడాలన్నారు.

రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్‌ ఒప్పందానికి కట్టుబడి తెల్లజొన్న, ఎర్రజొన్న కొనుగోళ్లు జరగాలని, రైతులు బయట మార్కెట్లో ఎక్కువ ధరకు ఇతర ట్రేడర్లకు పంట అమ్ముకోవాలని భావిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సీడ్‌ వ్యాపారులకు సూచించారు. మార్చి నెల 15వ తేదీ వరకు మార్కెట్‌ కు జొన్న, పసుపు పంట దిగుబడులు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా సాఫీగా క్రయవిక్రయాలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

పసుపు పంటను బాగా ఆరబెట్టి తీసుకుని వచ్చేలా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, తద్వారా పూర్తిస్థాయిలో వారు మార్కెట్‌ డిమాండ్‌ మేరకు ధర పొందవచ్చని అన్నారు. తేమ శాతం కారణంగా రైతులు నష్టపోకూడదని సూచించారు. మార్కెట్‌ యార్డుకు పసుపు నిల్వలను రైతులు తీసుకువచ్చిన వెంటనే జాప్యానికి తావులేకుండా వెంటదివెంట తూకం జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. డైరెక్ట్‌ పర్చేస్‌ సెంటర్‌ ల ద్వారా రైతులు పంటలు విక్రయించేలా చూడాలన్నారు. క్రయవిక్రయాలకు సంబంధించి ఇది ఎంతో కీలక సమయం అయినందున జాగరూకతతో విధులు నిర్వర్తించాలని, ఏ దశలోనూ రైతులు నష్టపోకుండా, ఇబ్బందులకు గురికాకుండా అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ హితవు పలికారు.

సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయాన్ని పెంపొందించుకుని పంటల క్రయవిక్రయాలు సాఫీగా జరిగేలా చొరవ చూపాలన్నారు. పంట విక్రయించిన రైతులకు వెంటవెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఎక్కడ కూడా వ్యాపారులు కూడబలుక్కుని ధర తగ్గించారనే ఫిర్యాదులు రాకూడదని, మార్కెట్‌ డిమాండ్‌ ను అనుసరిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో ట్రేడర్లు ధర చెల్లిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలని అన్నారు.

రైతులను మోసగించే చర్యలకు పాల్పడే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్‌ హుస్సేన్‌, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్‌, మార్కెటింగ్‌ శాఖ ఏ.డీ గంగవ్వ, ఏ.డీ.ఏలు, ఏ.ఓలు, పసుపు ట్రేడర్లు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

Print 🖨 PDF 📄 eBook 📱 భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »