డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాన్ని శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ భవనంలోని సెమినార్ హాల్లో ఎస్సీ,ఎస్టీ సెల్, బంజారా ఎంప్లాయిస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ధరావత్ నాగరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిలుగా వర్సిటీ వైస్ -ఛాన్స్లర్ ప్రొ. టి.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి, ప్రిన్సిపల్ ప్రొ.ఆరతి హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైస్ ఛాన్స్లర్ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ భారతదేశంలో బంజారాల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని కొనియాడారు. గౌతమ బుద్ధుని ఆశయాలను ఆచరణలో చూయించి సంచార జీవితం నుంచి స్థిర నివాసానికి అడుగులు వేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. మహాత్ములు ప్రబోధించే 22 కమాండెన్సును విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రా ఆచార్య యాదగిరి మాట్లాడుతూ భారతదేశంలో జాతుల విముక్తి పోరాటంలో సంతు సేవాలాల్ కృషి మరువలేనిదని పేర్కొన్నారు. బంజారా జాతి వారసత్వాన్ని సంస్కృతిని ఆచరణను ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సిద్దిపేట ప్రభుత్వ పి జీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథ్, నిజామాబాద్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యుడు డా. బిలోజి నాయక్, శ్రీను నాయక్, డా.రమేష్ నాయక్,కిరణ్ రాథోడ్, ప్రవీణ్, రాజు నాయక్, డా.బికోజి, నరేష్, గిరిజన శక్తి యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీను నాయక్, సాగర్ నాయక్, మోహన్, చందర్ రాథోడ్, లక్ష్మణ్, జాదవ్ పృథ్వీ, వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.