కామారెడ్డి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,మోడల్ స్కూల్, సంక్షేమ స్కూల్స్ ప్రిన్సిపల్స్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన విద్యాశాఖ రివ్యూ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, పక్కా ప్రణాళికలతో పదో తరగతి పరీక్షలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత కు కృషిచేసి జిల్లాను అగ్రభాగంలో నిలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రతి ప్రధానోపాధ్యాయుడు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యేలా శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. తరచూ విద్యార్థి వారిగా, విషయవారిగా ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పిల్లల ప్రగతిని బేరీజు వేసుకోవాలని, విద్యార్థులను 500 పైగా, 400 పైగా, 360పైగా, 300 మార్కుల పైగా, కచ్చితంగా పాస్ అయ్యేలా ఇలా విభాగాలుగా విభజించుకొని, టీచర్స్ పిల్లల్ని దత్తత తీసుకొని ఫలితాలను పెంచే విధంగా కృషి చేయాలని కోరారు.
గత సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులతో,అతి తక్కువ ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులను ప్రత్యేకంగా సమీక్షించి ఫలితాలను మెరుగు పరచుకోవాలని సూచించారు. ఫలితాలలో వెనుకబడిన పాఠశాలలు విద్యార్థుల ప్రగతిని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉందని అందుకు అనుగుణంగా ప్రతి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు.
ఎఫ్ ఎల్ ఎన్ లో విద్యార్థుల ప్రగతిని మరింత పెంచాలని , విద్యార్థుల కనీస సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు.మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం కచ్చితంగా పాటించాలని పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ కచ్చితంగా అందజేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అడవి లింగాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివ నరసింహారావు విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలి, ఎటువంటి బోధనా వ్యూహాలు అవలంబించాలి అన్న దానిపై ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రదర్శన చేశారు.
సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. రాజు, పరీక్షల విభాగ అసిస్టెంట్ కమిషనర్ బలరాం, డి సి ఈ బీ కార్యదర్శి లింగం, విద్యాశాఖ సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగవెందర్, వెంకట రమణారావు, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.