కామరెడ్డి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్ మెనూ అమలు పరచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వసతి గృహాలు, రెసిడెన్షియల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు.
అలాగే శుద్ధమైన త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కూరగాయలు, పప్పు దినుసులు, బియ్యం నాణ్యత గల సరుకులు కాంట్రాక్టర్ నుండి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రుచికరమైన భోజనాన్ని వండిన వెంటనే రుచి చూసిన తరువాత పిల్లలకు పెట్టాలని తెలిపారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ను ప్రత్యేక అధికారులు తనిఖీ చేయడం జరుగుతుందని, హైజనిక్ భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు.
వసతి గృహాల్లో అవసరమైన పనుల ప్రతిపాదనల మేరకు పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ, బి.సి., మైనారిటీ సంక్షేమ అధికారులు రజిత, స్రవంతి, దయానంద్, ఫుడ్ సేఫ్టీ అధికారిని శిరీష్, తదితరులు పాల్గొన్నారు.