నిజామాబాద్, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది కంటే యెల్లయ్య మృతి చాలా బాధాకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్‌లో నిర్వహించిన సంతాప సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్ ప్రాంత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు పూర్వ కార్యకర్తగా, బోధన్ శిశుమందిర్ పాఠశాల ప్రబందకారిణి సభ్యులుగా ఎనలేని సేవలు అందించి సమాజోద్ధరణకు కృషి చేశారని తెలిపారు.
జ్యూడిషియల్ ఉద్యోగిగా న్యాయవాదులు న్యాయ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండేవారని పేర్కొన్నారు. అనంతర కాలంలో న్యాయవాదిగా న్యాయసేవలు అందించారని కొనియాడారు.యెల్లయ్య జీవితపయనం హిందు సాంప్రదాయాలతో ముడిపడి కొనసాగిందని జగన్ తెలిపారు. సంతాప సూచకంగా న్యాయవాదులు రెండు నిమిషాలు మౌనం వహించారు. తదనంతరం న్యాయస్థానాల విధులకు దూరంగా ఉండాలని తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి దొన్పల్ సురేష్, కోశాధికారి దీపక్ తదితరులు పాల్గొన్నారు.