నిజామాబాద్, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మండల కేంద్రమైన మాక్లూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలియాతండాలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించి పీ.హెచ్.సీ నిర్వహణ తీరును గమనించారు. అన్ని రకాల ఔషధాలు సరఫరా అవుతున్నాయా అని ఆరా తీశారు.
రక్తపోటు, డయాబెటిక్ పరీక్షలు ప్రతి రోజు సగటున ఎంత మందికి నిర్వహిస్తున్నారు, రాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వాక్సినేషన్ రూంను సందర్శించి శీతలీకరణ ఉంచిన వాక్సిన్ లను, స్టోర్ రూంలో మందుల గడువు తేదీలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా ఆసుపత్రి పరిసరాలు శుభ్రం చేసేలా సిబ్బందిని కేటాయించాలని స్థానిక ఎంపీఓ ను ఆదేశించారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ ఎలియాతండాలో గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకులాన్ని సందర్శించి, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. కొత్త బియ్యం కేటాయించడం వల్ల అన్నం కాస్తంత మెత్తగా అవుతోందని నిర్వాహకులు తెలుపగా, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నాణ్యమైన సన్నబియ్యం కేటాయించాలని ఆదేశించారు.

స్టోర్ రూమ్‌లో నిలువ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలు, వంట నూనె ప్యాకెట్లు, పసుపు, కారంపొడి ప్యాకెట్లను, ఇతర సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట మాక్లూర్ డిప్యూటీ తహసీల్దార్ పద్మలత, గురుకుల పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ విద్యారాణి తదితరులు ఉన్నారు.