కామారెడ్డి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసు ఉన్నత అధికారులు, జిల్లా అధికారులతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇంటర్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని,మాల్ ప్రాక్టీస్ కు తా వివ్వకుండ నిర్వహించాలని అన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మెడికల్ టీమ్ ఏర్పాటుచేయాలని, ఇతర బయటి వ్యక్తులు లోనికి రాకుండా పరిశీలించాలని, ఇన్విజిలేటర్ గా ఇతర మండలాల టీచర్లను నియమించాలని అన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ లో బస్ పాసు ఏ రూట్లలో ఉన్ననూ, తన ఇంటి నుండి పరీక్ష కేంద్రానికి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
జిల్లాలో ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులు గ్రామీణ ప్రాంతంలో.13,744, పట్టణ ప్రాంతంలో 20,394 ఉన్నాయని తెలిపారు. ఆయా దరఖాస్తులను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ ప్రభాకర్, పలు శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.