సాగునీటి సమస్య తలెత్తితే… సంబంధిత అధికారులదే బాధ్యత

నిజామాబాద్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య ఉత్పన్నమైతే, సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. విధుల పట్ల అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తూ సాగునీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్‌ పట్టణంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో కలిసి కలెక్టర్‌ శనివారం ఇరిగేషన్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నీటి లభ్యత సరిపడా ఉన్నందున సాగు జలాల పంపిణీని పకడ్బందీగా పర్యవేక్షించాలని అన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగు జలాలు అందేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని, ఎగువ ప్రాంతాలలో నీటి చౌర్యం జరుగకుండా నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఈ విషయంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు. ఎక్కడైనా నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటే, ముందస్తుగానే గుర్తించి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. సమస్య ఏర్పడిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

జిల్లాలో ఎక్కడ కూడా సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉత్పన్నం కాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్‌ మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుతం పంటలకు సాగు నీటి ఆవశ్యకత ఉంటుందని, వచ్చే నెలన్నర రోజుల పాటు సాగునీటి పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. సాగునీటి పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఇరిగేషన్‌ సీ.ఈ లకు సూచించారు. సాగు జలాల పంపిణీ రైతులతో, పంటల సాగు అంశాలతో ముడిపడి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య సైతం నెలకొనకుండా అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రస్తుత యాసంగి సీజన్‌ లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎరువులకు పెద్ద ఎత్తున డిమాండ్‌ నెలకొని ఉందన్నారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈసారి 77 వేల మెట్రిక్‌ టన్నులకు ఎరువుల డిమాండ్‌ పెరిగిందని వివరించారు. దీని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని రైతాంగం అవసరాలకు సరిపడా ఎరువుల స్టాక్‌ ను ముందుగానే తెప్పించుకుని, అన్ని ప్రాంతాల రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

పన్ను వసూళ్లను వేగవంతం చేయాలి

ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న దృష్ట్యా పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలతో పాటు ఇతర సంస్థల నుండి రావాల్సిన ఆస్తి పన్నును ఆర్ధిక సంవంత్సరం ముగిసేలోపు నూటికి నూరు శాతం వసూలు చేసేలా స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉన్న వారికి నోటీసులు జారీ చేయాలని, అయినప్పటికీ స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సాంకేతికత సహాయంతో ఆస్తి పన్నును పక్కాగా లెక్కిస్తూ, నూటికి నూరు శాతం వసూలయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

క్యాన్సర్‌ బాధితురాలికి రక్తదానం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »