నిజామాబాద్, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్‌ను ఆదేశించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్ లోనే పూర్తి స్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్న గదుల్లో భద్రపర్చాలని, చెదలు నివారణ కోసం అవసరమైన చోట పెస్ట్ కంట్రోల్ చేయించాలని అధికారులను ఆదేశించారు.
పనులను పక్కాగా జరిపించాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజేందర్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.