నిజామాబాద్, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈసారి వేసవి సీజన్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వేసవిలో కార్మికులు, ప్రజలు భారీ ఉష్ణోగ్రతల వల్ల వడగాడ్పులకు లోనై ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీరు అందుబాటులో ఉంచాలని, అన్ని బస్తీ, పీ.హెచ్.సీ, సీ.హెచ్.సీలలో రెట్టింపు స్థాయిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

వైద్య ఆరోగ్య, ఉపాధి హామీ, పర్యావరణ, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు వడదెబ్బ నివారణపై కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, కేంద్రాలకు వచ్చే వారికి ఓఆర్‌ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలలో ఎండ తీవ్రత పై అవగాహన కల్పించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందించాలని సూచించారు.
ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా చూడాలని, ఒకవేళ అత్యవసరం అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధారణానికి మించి వేసవి ఉష్ణోగ్రతలు ఉన్న సమయాలలో ఏమి చేయాలో ఏమి చేయకూడదనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, వివిధ పరిశ్రమలలో పని చేసే వారు, భవన నిర్మాణ రంగ కార్మికులు తదితరులు ఎండలో పని చేయాల్సి రావడం వల్ల ఎక్కువగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున అలాంటి వారందరికీ తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
వడదెబ్బ నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందింపజేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వారు పని చేసే ప్రదేశాల్లో నీడను అందించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, కూలీలు తప్పనిసరిగా తమ వెంట తాగునీటిని తెచ్చుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా వడదెబ్బతో ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యాల బారిన పడకుండా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.