కామారెడ్డి, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మాడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ మండలంలో నిర్మించే ఇందిరమ్మ మాడల్ ఇంటి నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని అన్నారు.
పలు మండలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టే మేస్త్రీ లకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ప్రతీ మండలానికి ఇద్దరు చొప్పున శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక, ఇతర ముడిసరుకు సమకూర్చాలని తెలిపారు. ఇటుక తయారీ కోసం స్వయం సహాయక సంఘాలు గుర్తించి యూనిట్లు మంజూరు చేయాలని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిరుపేదలకు ప్రాధాన్యత కల్పించాలని, ఇళ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతించాలని తెలిపారు. కొత్త మండలాల్లో మాడల్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జడ్పీ సీఈవో చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, గృహనిర్మాణ శాఖ ఈఈ విజయపాల్ రెడ్డి, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.