నిజామాబాద్, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా నెలకొల్పిన వాటర్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించదల్చిన లయన్స్ జనరల్ హాస్పిటల్ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో గల స్థలాన్ని పరిశీలన జరిపారు. అధునాతన సదుపాయాలతో కూడిన మొబైల్ ఐ స్క్రీనింగ్ వ్యాన్ ను సందర్శించి, ఈ సంచార వాహనం ద్వారా గ్రామీణ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన పాతికేళ్ల నుండి ట్రస్టు ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా నామమాత్రపు రుసుముతో ప్రజలకు నేత్ర వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు జరగాలనే ఉద్దేశంతో లయన్స్ ఆసుపత్రికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను వర్తింపజేయడం జరిగిందన్నారు.

తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వారికి పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్సలు చేస్తారని అన్నారు. నేత్ర చికిత్సలతో పాటు ఇతర వైద్య సేవలను కూడా విస్తరించేలా లయన్స్ జనరల్ ఆసుపత్రి ఏర్పాటుకు ట్రస్టు నిర్వాహకులు ముందుకు రావడం పట్ల ఎమ్మెల్యే వారిని అభినందించారు. లయన్స్ జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు చొరవ చూపుతామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులో తెచ్చేందుకు లయన్స్ ఆసుపత్రి ట్రస్టుకు తోడ్పాటు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
కాగా, ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ నిర్మాణం కోసం బోధన్ పట్టణ శివారులోని అంబం గేట్ వద్ద గల ఎన్.ఎస్.ఎఫ్ స్థలాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు, రవాణా వసతి వంటి వాటికి అనువైన వాతావరణం ఉండడాన్ని గమనించిన కలెక్టర్, సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని స్థానిక అధికారులకు సూచించారు. వీరి వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈఓ అశోక్, తహశీల్దార్ విఠల్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.