నిజామాబాద్, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ సిఖ్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. తెలంగాణ సిఖ్ సొసైటీ వుమెన్ డెవలప్మెంట్ హబ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ పక్కన ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి, వైద్య శిబిరాలు ప్రారంభించగా, తెలంగాణ సిఖ్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీ.జీ.పీ) తేజ్ దీప్ కౌర్ పాల్గొన్నారు. వైద్య శిబిరాలను ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ సిఖ్ సొసైటీ ద్వారా చేపడుతున్న సహాయ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాములబస్తీలో గల గురుద్వారాలో కలెక్టర్, రిటైర్డ్ డీజీపీ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ వుమెన్ డెవలప్మెంట్ హబ్ కు శంకుస్థాపన చేశారు.
గురుద్వారాకు ఆనుకుని రేకుల షెడ్లలో నివాసాలు ఉంటున్న సిక్కు కుటుంబాల ఇళ్లను సందర్శించి వారి జీవన స్థితిగతులను కలెక్టర్ క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. అర్హులైన వారికి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని రిటైర్డు డీజీపీ కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమాల్లో సిఖ్ సొసైటీ ప్రతినిధులు దర్శన్ సింగ్, మహేందర్ సింగ్, దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.