కామారెడ్డి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అనధికార లే అవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీ శాఖల అధికారులు, లే అవుట్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2020 ఆగస్టు 31 నాటికి ముందే అనధికార లే అవుట్లలో 10 శాతం అమ్మకం జరిగి ఉన్నట్లయితే, మిగతా 90 శాతం ప్రస్తుతం క్రమబద్దీకరించుకోవచ్చని తెలిపారు.

దీని కోసం ప్రభుత్వం 25 శాతం రిబేటు అవకాశం మార్చి 31, 2025 నాటి వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా వ్యక్తిగత ప్లాట్లకు కూడా రాయితీ వర్తిస్తుందని తెలిపారు. అభ్యంతరం లేని ప్లాట్లకు ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు, ఎండోమెంట్ భూములు, నీటి పారుదల శాఖ భూములు, సీలింగ్ భూములు, శిఖం భూములు, కోర్టు కేసులు ఉన్నటువంటి వాటికి ఈ అవకాశం వర్తించదని కలెక్టర్ వివరించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి,జిల్లా రిజిస్ట్రార్ రమేష్ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్, పలు శాఖల అధికారులు, మున్సిపల్ కమీషనర్ లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు, తదితరులు పాల్గొన్నారు.