నిజామాబాద్, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు పంట విక్రయాలపై గట్టి పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పసుపు విక్రయాల సందర్భంగా రైతులకు ఏ దశలోనూ నష్టం వాటిల్లకుండా వారు మోసాలకు గురి కాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. పసుపు క్రయ విక్రయాల నిశిత పరిశీలనకై సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కృషి చేస్తారని అన్నారు.
అధికారులతో పాటు అదనపు కలెక్టర్ కూడా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. మార్కెట్ యార్డ్ లో పసుపు పంట క్రయవిక్రయాలు సజావుగా జరిగేలా, రైతులకు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా సరైన గిట్టుబాటు ధర అందేలా, సకాలంలో వారికి ట్రేడర్లు డబ్బులు చెల్లించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరుపుతారని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. పసుపు పంట కొనుగోళ్లలో ఎవరైనా మోసాలకు పాల్పడుతూ రైతులకు నష్టం చేకూరేలా వ్యవహరిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.