కామారెడ్డి, మార్చ్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం బిక్నూర్ మండలం ర్యాగట్ల పల్లి గ్రామంలో లబ్ధిదారురాలు నాగి వనజ భరత్ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన దానిని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని తెలిపారు. అర్హత గల వారిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయడం జరిగిందని, లబ్ధిదారులకు ఉన్న ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. బిక్నూర్ మండలంలో 145 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్ పాల్ రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ రవికిరణ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.