నిజామాబాద్, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభించడం జరుగుతోందని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యెగితారాణా అన్నారు. గురువారం ఆమె విద్యా శాఖ కమిషనర్ నర్సింహారెడ్డితో కలిసి హైద్రాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రోగ్రాం, క్వాలిటీ అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా యెగితా రాణా మాట్లాడుతూ, ఎస్‌సిఇఆర్‌టి తెలంగాణ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష తెలంగాణ విద్యాశాఖ మౌళిక భాషాగణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో (ఎఫ్ఎల్ఎన్) లో కృత్రిమ మేథను ఉపయోగించి బోధన ను మెరుగుపరచడానికి ఎఎక్స్ఎల్, ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారంతో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు గా 6 జిల్లాల్లో ప్రారంభించిందని అన్నారు.
ఆయా జిల్లాలలో మెరుగైన ఫలితాలు ఉన్నందున రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలలో కూడా ఈనెల 15 వ తారీకున ప్రారంభించాలని, సంకల్పించామని, ప్రతి జిల్లా నుండి ఒక క్వాలిటీ కంట్రోలర్, ఒక మండల విద్యాశాఖాధికారి, ఒక పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు, ఒక ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయుడు ఇలా ప్రతి జిల్లా నుండి నలుగురికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇప్పించామని తెలిపారు.
ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నా, ప్రాథమిక స్థాయిలో భాషలో అభ్యసనా సామర్ధ్యాలు, అలాగే గణితంలో చతుర్విధ ప్రక్రియల్లో వెనకబాటులోనే ఉంటున్నారని. ఈ విషయాన్ని వివిధ విద్యా పరిశోధన, సర్వే సంస్థలు కూడా వెల్లడి చేస్తున్నాయన్నారు.

ఈ క్రమంలో కృత్రిమ మేధ సాయంతో ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించడం కోసం కృషి జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.