మాక్లూర్, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం గంగరమంద గ్రామంలో ధ్వంసమైన భీమన్న దేవుడి విగ్రహాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ గురునాథ్, ఎస్సై రాజారెడ్డి మంగళవారం సందర్శించారు. అంతకు ముందే నాయక్ పోడ్ సేవా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కులస్తులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
జిల్లాలోని పలు మండలాల నుంచి కుల సంఘం నాయకులు తరలివచ్చారు. తమ కుల దైవం విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాయక్ పోడ్ నాయకులు పోలీసులను కోరారు.
నాయక్ పోడ్స్ ధర్నా చేసేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ సంస్క ృతీ సంప్రదాయాలపై దాడి చేస్తే ఎంతటివారైనా ఊరుకునేదిలేదన్నారు. తమకు న్యాయం జరిగేవరకు ఇక్కణ్నుంచి కదలబోమని భీష్మించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు కోరారు. నూతన విగ్రహాన్ని తామే ఏర్పాటు చేస్తామని, దుండగులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
దీంతో నాయక్ పోడ్స్ మాక్లూర్ ఠాణాకు చేరుకున్నారు. ఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎంపీపీ మాస్త ప్రభాకర్ సందర్శించారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించి రూ.10 వేల విరాళం అందజేశారు. ఘటనా స్థలిని సందర్శించినవారిలో ఆదివాసీ నాయక్ పోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం శంకర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల రాంచందర్, కోశాధికారి సురేశ్ రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్య, మాక్లూర్ మండల అధ్యక్షుడు పందిరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భోజన్న, నందిపేట్ మండల అధ్యక్షుడు మన్నె సాగర్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు పసుల రాజు, యూత్ ప్రెసిడెంట్ సతీశ్, వైస్ ప్రెసిడెంట్ సుంకరి వెంకటేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం అప్పారావు తదితరులు ఉన్నారు.