నిజామాబాద్, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.
సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా, వాటిని సకాలంలో పూర్తి చేసుకునేలా కృషి చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని లబ్ధిదారులు గుర్తిస్తూ, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇంకనూ అర్హులైన వారు ఎవరైనా తప్పిపోయే ఉంటే, అలాంటి వారిని గుర్తించి మంజూరీ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోయిన లబ్దిదారులను కలిసి, వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక తోడ్పాటు గురించి వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు. నిర్దేశిత గడువు లోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, స్థానిక అధికారులు ఉన్నారు.